Thursday, June 12, 2014

దాశరథి కృష్ణమాచార్య ..10-8-1976

ఈ భువిలో విరిసిన పారిజాతం... ఏ దివికెగసి పోయెనో ? .. 

గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థానకవి, కళాప్రపూర్ణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ...కుటుంబ పరంగా మా నాన్నగారి అక్కయ్య తనయుడు కావటంతో నాకు మేన బావ అవుతారు. ఆయన 1976లో ఢిల్లీ వచ్చినపుడు మా ఇంటికి వస్తానన్నారు. కాని రాలేకపోయారు. అప్పుడు నేను ఢిల్లీలోని ఘజియాబాద్ కు చెందిన భారతీయ వైమానిక దళంలో పనిచేస్తూ వుండే వాణ్ణి.

సరే ! ఎందుకు రాలేదని అడుగుతూ ఉత్తరం వ్రాస్తే, ఆయన నాకిచ్చిన సమాధానం యిది !

డీయర్ పురుషోత్తం !

నీ ఆగష్టు 7.1976 ఉత్తరం నా చేతికందింది. అందులో నీవు ఇంతకు ముందు కొన్ని ఉత్తరాలు వ్రాసానని అన్నావు. కాని అవి నాకు అందలేదు. బహుశ నీకు నా అడ్రస్ లోని మార్పు తెలీనట్లుంది. నా పాత అడ్రస్ కు చేరిన ఉత్తరాలన్నీ ఇక్కడికే తిరిగి వస్తున్నాయి. ప్రస్త్తుతం నీ ఉత్తరం అలాగే అందింది.

ఆంధ్ర యూనివర్సిటీ వారు తమ 48’వ వార్షిక స్నాతకోత్సవం లో నాకు జరిగిన 'డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ 'బిరుదు ప్రదానం ఉత్సవం తరువాత ఆ మార్గపు వంతెన క్రిందుగా ఎంతో ప్రవాహం కొనసాగింది. ఆ వెంటనే ఆగ్రా యూనివర్సిటీ వారు తమ 47’వ వార్షికోత్సవంలో మరో 'డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ ' అర్హతని అంటగట్టారు. ఆగ్రానుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో ఆగి ఓడజను యితర భాషల రచయితలతో కలిసి భారత ప్రధాన మంత్రి గారిని వారి సఫ్దర్ జంగ్ నివాస గృహంలో కలిసాను. దాదాపు ఒక గంట వారి ఇంట గడిపాక ప్రధాని మాతో గ్రూప్ ఫోటో దిగారు. దాన్ని నీవు కలిసినపుడు చూపిస్తాను.

నీవింకా ఘజియాబాద్ లోనే వున్నావనుకుని నీ దగ్గరకు వద్దామనుకున్నాను కాని విపరీతమయిన చలి బాధతో బాటు వొంట్లో కొద్ది నలత కూడా ఏర్పడి ఆ యిబ్బందితో రావటానికి వీలు పడలేదు. ఢిల్లీ చేరాక జనపథ్ హోటల్లో వున్నాను. అదే సమయంలో (28-2-76న) శ్రీమతి లక్ష్మీ రఘు రామయ్య గారు అధ్యక్షత వహించిన మన రాష్ట్ర పార్లమెంటుమెంబర్ల సమావేశంలో పాల్గొన్న సభ్యులకి నా సందేశాన్నిఅందజేశాను.

ఆ తర్వాత కొనసాగిన నా విదేశీయానంలో ఫెడరేషన్ ఆఫ్ మలేసియా , రిపబ్లిక్ అఫ్ సింగపూర్ యాత్ర ఎంతో విజయవంతంగా ముగిసింది. ఆ పరంగా గడిచిన యాత్రలో మొదటి ఇరవయి రోజుల్లోనే ఓ పద్దెనిమిది సభలను ఉద్దేశ్యించిమాట్లాడాను.

మలేసియా తప్పక చూడాలసిన దేశం ! దేశమంతా ఓ ప్రక్క పచ్చదనం విల్లివిరుస్తుండగా మరో ప్రక్కన రబ్బరు, లోహాల అధునాతన యంత్రాగారాలు పనిచేస్తున్నాయి . రాత్రి వేళలో చిక్కటి అడవులగుండా సాగిన కారు ప్రయాణం భయంకరంగా తోచింది. చాలా కాలంగా ఈ దేశంలోనిస్థానికులపై ఎరుపు జాతివారి బీభత్సం కొన సాగుతోంది. ప్రతి రోజు వార్తా పత్రికలలోనూ, టెలివిజన్ లోనూ ఆ జాతికీ , సైన్యానికీ మధ్య జరిగే సంఘటనల వివరాలే అధికంగా కనిపిస్తాయి. “ఎరుపు జాతిని అణగ దొక్కండి… లేదా అంతరించిపొండి ! “అన్నది ఈ దేశ ప్రభుత్వ నినాదంగా రూపు దిద్దుకుంది. ఈ దేశానికి దగ్గరలో లావోస్ ,కాంబోడియా , వియత్నాం లాంటి కమ్యూనిస్ట్ దేశాలున్నాయి. థాయిలాండ్ దేశం కూడా ఎరుపు వారి చేతిలో నలుగుతోంది. మలేసియా లో దుమ్ము ధూళీ కంటికి కనిపించవు. ఎన్ని మైళ్ళ ప్రయాణ మయినా సుఖంగా సాగుతుంది.

మలేసియాలోని 'పెనాంగ్' అనే ద్వీపవనం కూడా చూడదగ్గది. చిక్కటి అడవి మధ్యలో “కౌలాలంపుర్” విమానాశ్రయం నిలిచి వుంది. మలేసియాలో చైనీయులు అధిక సంఖ్యలో కనిపిస్తారు. దాదాపు ముప్ఫయి శాతం చైనీయులున్న ఈదేశంలో అందమయిన యువతుల చేతుల్లోనే రకరాకాల దుకాణాలు , సూపర్ మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. దేశ వ్యాపార లావాదేవీలన్నీ చైనీయుల చేతుల్లోనే మగ్గుతున్నాయి.

“మలయులు” అంటే “భూమిపుత్రు”లని అర్థం ! వీరు చాల పేదవారు. కాని ప్రభుత్వం వారి చేతుల్లోనే నడుస్తోంది. ప్రజల్లో 11% భారతీయులు వున్నారు. వారిలో తమిళులధికం. తెలుగు వారు కూడా కొద్ది సంఖ్యలో కనిపిస్తారు. సింగపూర్ దేశం ఓ ప్రత్యెక తరహాలో కనిపిస్తుంది ఈ దేశంలో కూడా మలయ భాషే అధిక ప్రచారంలో వుంది. అలాగే ప్రక్కనున్న ఇండోనేషియా సియాం , అన్నం దేశాల్లో కూడా మలయ భాషనే అధికారికంగా ఉపయోగిస్తున్నారు

ఏదయితేనేమి ఈ యాత్ర నాకెంతో తృప్తిని కలిగించింది. తిరిగి వచ్చాక హైదరాబాద్ లో ఎన్నో సమావేశాల్లో నా అనుభవాల్ని సభికులకు వెల్లడించాను. అక్కడ నేను చూసిన చైనా, మలయ భాషా చిత్రాల వివరాల్ని కూడా అందరికీ తెలియ చేశాను.

నా కొత్త అడ్ద్రసును నోటు చేసుకో !. నీవు బెంగళూరుకు వచ్చి ఎన్నాళ్ళయ్యింది ?

No comments:

Post a Comment